Type Here to Get Search Results !

పదో తరగతి ఫలితాలు : ఒక సోషల్ టీచరు ప్రతిస్పందన

పదో తరగతి ఫలితాలు : ఒక సోషల్ టీచరు ప్రతిస్పందన



పదో తరగతి ఫలితాలు - Part 1 :

20 మంది నా క్లాస్ లో ఫెయిలయారు. Mathsలో 21 మంది, సైన్స్ లో కూడా 20 మంది ఫెయిలయారు.

ఫెయిలయిన వాళ్ళందరూ నేను ముందుగా హెచ్చరించిన వాళ్ళే. ఒక్కరు కూడా నా మాట వినలేదు.

 చదువంటేనే లెక్క లేదు, సోషలంటే అసలు లెక్క లేదు. 'ఇలా అయితే ఫెయిలవుతార్రా' అంటే ఎగతాళిగా నవ్వుకునే వాళ్ళు.  ఈ సంవత్సరం ఫార్మటివ్  లో స్లిప్ టెస్టుల క్వశ్చన్ పేపరు బయట నుండి వస్తదంటే కాస్త భయపడ్డారు. కానీ అవి యూ ట్యూబ్ లో జవాబులతో సహా వచ్చేసరికి వాళ్ళకి టీచర్లు జోకర్ల లాగా కనబడ్డారు. దానికి తోడు స్కూల్ లో కాపీయింగ్.

మీకు తెలుసా? యూ ట్యూబ్ లో లీకైన పేపర్లకి అచ్చంగా ఆప్షన్స్ మాత్రమే  (a,b,c,dలు) చదువుకునీ, అది కూడా ఒళ్ళు బద్దకమైన వాళ్ళు చిట్టీలు రాసుకునీ వచ్చారు చాలామంది. కనీసం ఆ లీకైన ప్రశ్నల వరకన్నా సరిగ్గా నేర్చుకుందామని లేదు. అంత లెక్క లేని తనం!

ఆఖరికి ప్రీ-పబ్లిక్ అప్పుడు స్టడీ అవర్ కి 48 మందికి గాను 15 మంది మాత్రమే హాజరయారు. కానీ ఆ రాని వాళ్ళకి కూడా ప్రీ - పబ్లిక్ లో 90 లు, 100లు మార్కులు. ఎందుకంటే అది కూడా యూ ట్యూబ్ లో వచ్చిందే, జవాబులతో సహా.

ఇక ఆ పిల్లలు ఎవరినీ లెక్క చేసేలా లేరు. లవ్వులూ లెటర్లూ etc etc. కొందరు అబ్బాయిలైతే లేడీ టీచర్స్ గురించి కూడా అసభ్యంగా కామెంట్ చేసే స్థితికి వచ్చారు.

తెలివైన వాళ్ళనుకున్న పిల్లలు కూడా చాలా మంది లెక్కలు, సైన్సుకి ఇచ్చిన ప్రాముఖ్యత సోషల్ కి ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళకి సోషలంటే లెక్క లేదూ..సోషల్ టీచరంటే కూడా లెక్క లేదు. ఎంత బతిమలాడి చెప్పినా, భయపెట్టినా 'సోషల్ దేముందిలే, చదివినా చదవకపోయినా, ఏమి రాసినా, జానాబెత్తలు కొలిచి మార్కులు వేసేస్తారు’ -ఇదే వాళ్ళ ఫీలింగ్.

ఇప్పుడు సోషల్ లో మార్కులు తగ్గినాయని మా క్లాస్ టాపరు ఫీలవుతోంది గానీ, నాకు ఆ అమ్మాయి మీద సానుభూతి కలగడం లేదు. నేను ముందు నుంచీ చెబుతున్నా, వినిపించుకోలేదామె.

ఫార్మటివ్ లూ,ప్రీ- పబ్లిక్ లూ వీళ్ళను ఏమీ చేయలేకపోయినా ఈ పబ్లిక్ మాత్రం వీళ్ళకు బుద్ధి చెప్పింది. వీళ్ళకే కాదు,"మీ సోషల్ దేముంది లే సార్.." అని క్లాసుల దగ్గర నుండి ప్రతి చోటా లైట్ తీసుకునే వాళ్ళకు కూడా బుద్ధి వచ్చింది.

మోడల్ మారినా కూడా తెలుగు, హిందీ,ఇంగ్లీషు ల లో పాత మోడల్ లాగే బిట్ పేపరు ఉంది(అసలు పేపరులో భాగం గానే). Maths, science, social లో ఇప్పుడు బిట్ పేపర్ లేదు. ఇది చాలా ప్రభావం చూపింది. పాత పద్ధతిలో బిట్ 30 marks ఉండటంతో Bit, map లతోనే pass అయిపోయేవాళ్ళు. spot లో మనమే బ్లూ ఇంక్ తో abcd లు పెట్టి ఎందరిని pass చేశామో! ఇప్పుడా ఛాన్స్ లేదు.

మొదటి మూడు పరీక్షలూ పాత మోడల్ లాగానే కాపీయింగ్ జరిగాయి. తరవాతి మూడూ ,టీచర్ల అరెస్టుల నేపధ్యంలో, strict గా జరిగాయి. అరెస్టైన టీచర్ల ఫోటోలు, ముఖాలకు ముసుగు కప్పినవి, అన్ని వాట్సాప్ గ్రూపులలోనూ వచ్చే సరికి చాలా చోట్ల ఎత్తిన గేట్లను దించేశారు. సోషల్ వచ్చేటప్పటికి అసలు చీఫ్ ల దగ్గర కూడా ఫోనులు లేని పరిస్థితి. దీనితో చాలా చోట్ల కాపీయింగ్ కుదరలేదు.

ఇవే ఈ పాస్ పర్సంటేజ్ తగ్గడానికి అసలు కారణాలని నేననుకుంటున్నాను.

పేపరు మరీ కఠినమైతే వేలాది మందికి 95 పైన ఎలా వచ్చాయి? కఠినమైనా కూడా 40-50marks easy గా వచ్చేవి కనిపిస్తూనే ఉండగాఇంత పెద్ద మొత్తంలో failures ఎందుకు వచ్చాయి?

నా సబ్జెక్టులో రిజల్ట్ కొంత తగ్గినా సరే..నా మాట, నా క్లాసు వినే పరిస్థితి ఏర్పడింది. ఇది మేలే. శ్రద్ధ పెట్టి సోషల్ కూడా వినాలని నేర్చుకున్న ఒక ‘అబౌ యావరేజి’ అమ్మాయి ఒకామె సోషల్ ని లెక్క చేయకుండా ఉన్న ‘ క్లవర్’ కంటే ఎక్కువగా, 98 marks తెచ్చుకుంది. Results వచ్చాక ఆమె నా దగ్గరకు వచ్చి "Thank you sir" అని అంటుంటే చాలా తృప్తిగా అనిపించింది.”

పదో తరగతి ఫలితాలు - Part 2 :

ఇది (part -1 లో చెప్పింది) ఆ ఒక్క టీచరు అభిప్రాయమే కాదు. శ్రద్ధగా పని చేసే అనేకమంది అభిప్రాయం. ఒక్క సోషల్ అనే కాదు, దాదాపు అన్ని సబ్జెక్టులలోనూ పిల్లల నిర్లక్ష్య,  దౌర్జన్యపూరితమైన ప్రవర్తన ఒక సమస్యగా పరిణమించింది. (అందుకు కారణాలున్నాయి, వాటిని సానుభూతితో అర్ధం చేసుకోవాలి, అందరం కలిసి పరిష్కారాలు ఆలోచించాలి - అది వేరే విషయం).

కాపీయింగ్ కి టీచర్లే గదా కారణం? అవును, టీచర్లే. అయితే అందరూ అలా ఉంటారని అనుకుంటే అది తప్పు. బాగా పని చేసే టీచరెవరైనా పరీక్షలు స్ట్రిక్ట్ గానే జరగాలని కోరుకుంటారు. లేకుంటే ఆయనకే/ఆమెకే కష్టం. తన క్లాసు శ్రద్ధగా వినాలనే ఆసక్తి తగ్గిపోతుంది పిల్లల్లో, ఉద్దరగా మార్కులు వచ్చేస్తుంటే.

 కానీ CCE అనే పద్ధతి టీచర్లు, పిల్లల మీద అలివిమాలిన బరువుపెట్టి వాళ్ళను అనైతిక పద్ధతుల్లోకి నెట్టివేస్తోంది.

పాత యూనిట్ టెస్టు బదులు ఇప్పుడు ఫార్మటివ్ అని 50 మార్కులకు ఉంటుంది. ప్రాజెక్టు 10 మార్కులు, సొంత నోట్సు 10 మార్కులు, సృజనాత్మక ప్రతిస్పందన 10 మార్కులు, స్లిప్ టెస్టు 20 మార్కులు. మొత్తం కలిసి 50.

వీటిలో లాస్టుది తప్ప మిగిలిన మూడూ ఆబ్జెక్టివ్ గా evaluate చేయడం కష్టం. మన ఓవర్ క్రౌడెడ్ క్లాసు రూముల్లో అయితే అసలు అసాధ్యం. అందువల్ల ఈ నాలుగింటిలో మొదటి మూడు టూల్సూ ‘పిచ్చి మార్కులే’ వేయబడుతున్నాయ్. అక్కడే టీచర్ల నిస్సహాయత బయటపడుతోంది పిల్లల సమక్షంలో...

రాష్ట్రంలో (తెలంగాణ తో సహా) ఏ టీచరునైనా కనుక్కోండి, వీటిలో ఎంతో కొంత శాతం అబద్ధపు మార్కులు (రూల్స్ ను ఎంతో కొంత వ్యతిరేకించి) వేయని వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించరు. (శాతాల్లో మాత్రమే తేడా).

కొందరే ఇలా చేస్తుంటే, వాళ్ళను పనిదొంగలనుకోవచ్చు. అందరూ అలాగే చేయవలసివస్తున్నదంటే ఆ పాలసీ దే తప్పు గదా. దాన్ని మార్చుకోవాలి గదా.

ఎందరు ఎంత కాలంగా మొత్తుకుంటున్నా, దాన్ని ప్రవేశపెట్టిన ఎన్ సీ యీ ఆర్ టీ నే దాన్ని ఎత్తేసినా మనం మాత్రం దాన్నే అంటిపెట్టుకుని ఉన్నాం.

ప్రతి ఫార్మటివ్ మార్కులూ, టెర్మినల్ ఎగ్జామ్స్ మార్కులూ ఆన్లైన్ చేయడం ఒక నిర్బంధం. ఆన్లైన్ చేయాలనే సరికి మన సబ్జెక్టులో మార్కులు తగ్గితే ఎలా అని టీచర్లకు భయం. టర్మినల్ ఎగ్జామ్స్ లో మార్కులు తగ్గితే ఏమవుతుంది? - భయంతోనో, పరీక్షల ప్రేరణతోనో పిల్లలు మరింత శ్రద్ధగా చదువుకుంటారు గదా. అసలు ఈ ఆన్లయిన్ చేయడం ఎందుకు? ఇన్ని  సంవత్సరాలుగా (టీడీపీ లో సంధ్యారాణి అనే వారు కమీషనర్ గా ఉండగా ఈ ప్రహసనం మొదలయింది) లక్షలాది టీచర్లు అప్లోడ్ చేసిన కోట్లాది అంకెలతో వీళ్ళు ఉద్ధరించినది ఏమిటి? ఏం కనుక్కున్నారు? ఈ సమాచారం ఆధారంగా వీళ్ళు చేసిన నిర్ధారణలేమిటి? చేసిన విశ్లేషణలేమిటి? వాటి ఆధారంగా వీళ్ళు ప్రతిపాదించిన విధానాలేమిటి? - శూన్యం!

ఫార్మటివ్ లోని మొదటి మూడు టూల్స్ నీ పరీక్షలుగా కాకుండా మామూలు కృత్యాలుగా చేసుకోమని చెప్పి, పాత పద్ధతి లోనే టీచర్లు పెట్టుకునే యూనిట్ పరీక్షలు పెట్టడం మేలు.

క్వార్టర్లీ,హాఫియర్లీ పరీక్షలు జిల్లా బోర్డుల ఆధ్వర్యంలో గతంలో చక్కగా జరిగేవి. అలాగే ఇప్పుడూ జరిగితే మేలు.

పాఠశాల స్థాయిలో జరిగే అన్ని పరీక్షలూ స్ట్రిక్ట్ గానే జరగాలి. ఆ విషయంలో ప్రధానోపాధ్యాయులకే స్వేచ్ఛ ఇవ్వాలి. ‘పిచ్చి టూల్స్’ అన్నీ తీసేసి, ఆన్లయిన్ చేయడం విరమిస్తే, ఫలితాలు 90శాతం పైన ఉండాలని పై నుండి ఒత్తిడి చేయడం మానేస్తే, ప్రధానోపాధ్యాయులు చక్కగానే జరుపుతారు పరీక్షలు.

ఎవరైతే క్లాసులు సరిగా చెప్పక, ఎగ్గొట్టి తిరుగుతారో, అలాంటి వాళ్ళే తమ తప్పు బయటపడకూడదని ఇలా కఠినంగా పరీక్షలు జరగడాన్ని వ్యతిరేకిస్తారు. వాళ్ళ మాట చెల్లనీయరాదు.

పదో తరగతి ఫలితాలు -Part 3 :

ఈ సంవత్సరం ఫలితాలు తగ్గాయని గగ్గోలు పెట్టడం మన పిల్లల ఆరోగ్యానికే మంచిది కాదు.

ఇక దీన్ని రాజకీయం చేయడమైతే హేయం. దిగజారుడు తనం.

తెలుగు, ఇంగ్లీష్, హిందీలలో కేవలం మూడు శాతంగా ఉన్న ఫెయిల్యూర్స్ గణితం, సైన్సు, సోషల్ లలో అకస్మాత్తుగా ఇరవై శాతం అవడానికి, ఇంగ్లీష్ తర్వాత ‘నారాయణ’ భరతం పట్టొచ్చనో ఏమో ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకోవడానికీ ఉన్న సంబంధం ఎవరికైనా సులభంగానే అర్ధమవుతుంది. ఎందుకు జరిగితే ఏమీ? జరిగింది మంచిదే.

ఈ సందర్భంగా పరీక్షా సంస్కరణల జీ.వో. గురించి తెలుసుకోవడం కూడా అవసరం.

అప్పట్లో తెలుగుదేశం గవర్నమెంట్ లో సంధ్యారాణి గారు సంస్కరణల పట్ల కడు ఆసక్తి చూపేవారు. ఆమె ప్రవేశపెట్టిన ఐ. టీ సెల్ వల్లే నానా రకాల అప్లోడ్ల తలనొప్పి టీచర్లకు చుట్టుకుంది.

అప్పట్లో ఆమె “పరీక్షల ఫలితాలు మరీ 97, 98 శాతాలు వస్తున్నాయేంటి? ఈ ధోరణి అరికట్టాలంటే ఏమి చేయాలి?” అని చర్చించారు. “బిట్ పేపరు ఎత్తేయమ్మా, దెబ్బకు కాపీయింగ్ తగ్గిపోతుంది” అనే సలహా ఇచ్చారు కొందరు సీనియర్ అధికారులు. 

ఎవరో గానీ, గట్టి సలహానే ఇచ్చారు. ఇన్విజిలేషన్ లో ఎంత స్ట్రిక్టుగా ఉన్నా బిట్లు పాసాన్ అవకుండా ఆపలేకపోయేవారు.

చాలా సెంటర్లలో మొత్తం బిట్ పేపర్ కీ జవాబులు చెప్పేసేవాళ్ళు. అన్నీ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలే అవడం వల్ల ఒక్క వాక్యం రాయడం రాకున్నా just A, B, C, D లు పెట్టేస్తే bit లో 30., ఏదో ఒక బొమ్మ తోనో, మ్యాప్ తోనో, గ్రాఫ్ తోనో ఐదు – చాలు; ఒక్క వాక్యం రాయకున్నా పాస్.

అప్పుడు వచ్చింది పరీక్షా సంస్కరణల జీ.వో.  విడిగా బిట్ పేపర్ అనే దాన్ని ఎత్తేశారు. ఆన్సర్లు రాయడానికి అడిషనల్ షీట్లు ఇవ్వడం కాకుండా ఆన్సర్ బుక్లెట్ ఇవ్వాలన్నారు.(దీనితో పేపర్లు మార్చుకోడానికి చెక్ పడింది).

అయితే  కరోనా కారణంగా ఇన్నాళ్ళుగా పరీక్షలు జరక్క, ఆ జీ.వో. ఈ సారి అమల్లోకొచ్చింది.

కరోనాకు ముందు ఇది అమలై,  పరీక్షలు ఈ చివరి మూడు పరీక్షల లాగా కఠినంగా జరిగి ఉంటే, అప్పుడైనా కొంత అటూ ఇటూగా ఇలాంటి రిజల్టే వచ్చి ఉండేది. ఇది చేదుగా ఉన్నా, ఇదే నిజం.

ఈ ఫలితాలలో అన్ని జిల్లాల కంటే ఆఖరున నిలిచింది అనంతపురం జిల్లా. అక్కడ డి.యీ.ఓ. శామ్యూల్ గారు. “మావి నిజమైన ఫలితాలు. వచ్చే ఏడు ఖచ్చితంగా మెరుగవుతాం” అని ప్రకటించారాయన. ఆయన మాటల్లోని అంతరార్ధం తెలుస్తూనే ఉంది గదా.

శామ్యూల్ గారు చిత్తూరు జిల్లా డి.యీ.ఓ. గా ఉండగా ఆ జిల్లా పదో తరగతి ఫలితాల పర్సంటేజీ లో అన్నిటికంటే అడుగున ఉంది. ఆ మరుసటి సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో అన్ని జిల్లాల కంటే పైన ఉంది. దీని అంతరార్ధమూ తెలుస్తూనే ఉంది గదా.

ఇంత చర్చ జరిగింది గదా, రాష్ట్రవ్యాప్తంగా.

ఇకనైనా ప్రభుత్వాలు ఆచరణ సాధ్యం కాని విధానాలను ఎత్తి వేసి, టీచర్ల పట్ల నమ్మకంతో, వాళ్ళను మోటివేట్ చేసి పని చేయించే నాయకత్వంతో ముందుకొస్తాయా? ఏమంటారు మీరు?

కనీసం మీరైనా ‘ఇంత కధ ఉందన్న ఎరుక’తో కేవలం టీచర్లనే అన్నిటికీ బాధ్యులని నిందించకుండా ఉంటారా?

పదో తరగతి ఫలితాలు Part 4 :

ఇవిగో, గత మూడు పరీక్షల్లో పాస్ పర్సంటేజ్ కి సంబంధించిన ఈ స్టాటిస్టిక్స్ చూడండి, అసలు విషయం అర్ధమవుతుంది.

సబ్జెక్టు - 2018 - 2019 - 2022

తెలుగు - 99   -    99 –    92

హిందీ -   99 –  99 -     97 

ఇంగ్లీషు - 99 –  99 -     97

లెక్కలు - 96 –  96 -    80

సైన్సు -   97 -    98 -     82

సోషలు - 99 – 99 –    81

ఇవి చూశాక ఇప్పుడు ఆలోచించండి.

1.కరోనా కారణమా? అయితే హిందీ, ఇంగ్లీష్ లలో కరోనాకు ముందు ఎంత పాస్ పర్సంటేజ్ ఉందో, అదే ఈ సంవత్సరం కూడా ఎలా వచ్చింది? కరోనా నేపధ్యంలో సైతం మన పిల్లలు పరాయి భాషలైన హిందీ, ఇంగ్లీషులలో అంత ప్రత్యేక నైపుణ్యాలను కలిగి ఉన్నారా? కనీసం పాస్ మార్కులు తెచ్చుకునే నైపుణ్యాలను తెలుగు(91%)కంటే హిందీ (97%), ఇంగ్లీషు(97%)లలో ఎక్కువగా కలిగిఉన్నారా?

2. ‘టీచర్లు చెప్పి ఏడిస్తే గదా’ అనో, ‘ప్రభుత్వం మీద కోపాన్ని పిల్లల మీద చూపారు’ అనో అంటారా? అయితే లాంగ్వేజ్ సబ్జెక్టు లన్నిట్లో 90 పైన పాస్ పర్సంటేజ్ ఎందుకు వచ్చింది? లాంగ్వేజ్ టీచర్లందరూ బాగా చెప్పి, గ్రూప్స్ చెప్పే వాళ్ళందరూ బాగా చెప్పలేదా? లాంగ్వేజ్ టీచర్లకు మాత్రం ప్రభుత్వం మీద కోపం లేకుండా గ్రూప్స్ చెప్పే టీచర్లకే ఉందా?

3. “గ్రూపు సబ్జెక్టులు కష్టం గదా,  అందుకని లాంగ్వేజ్ లు మూడిట్లో 91, 97, 97పాస్ పర్సంటేజి, గ్రూపు సబ్జెక్టులు మూడిట్లో 80, 82, 81 పాస్ పర్సంటేజీ వచ్చాయి” అంటారా? అయితే గత సంవత్సరాల్లో కూడా ఇవే లాంగ్వేజ్ లు, ఇవే గ్రూప్ సబ్జెక్టులు కదా. అప్పుడు లాంగ్వేజ్ లలో, గ్రూప్ లలో అన్నిట్లో ఒకే లాగా 98, 99 శాతం పాస్ పర్సంటేజ్ ఎలా వచ్చింది?

4. “సోషల్ కష్టంగా వచ్చింది, అదే కారణం” అంటారా? అయితే సోషల్(81) కంటే లెక్కల్లో(80) పాస్ పర్సంటేజ్ ఎందుకు తగ్గింది? ‘సోషల్ కంటే లెక్కల్లో పాస్ కావడం కష్టం గదా’ అంటారా? అయితే 2018, 2019 లలో కూడా ఇవే లెక్కలు, ఇవే సోషల్ కదా. అప్పుడు దాదాపు రెండింట్లో ఒకటే పాస్ పర్సంటేజ్ (కేవలం 3% తేడా) ఎలా వచ్చింది?  లెక్కలు పేపరు కూడా కష్టంగా వచ్చిందంటారా? అంతకు ముందు 97, 98 గా ఉన్న సైన్స్ పాస్ పర్సంటేజ్ కూడా ఈ సారి 82 నే. అది కూడా కష్టంగా వచ్చిందంటారా? అందరూ కూడబలుక్కున్నట్లు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పేపర్లేమో ఈజీ గాను, లెక్కలు, సైన్సు సోషల్ పేపర్లేమో కఠినం గాను ఇచ్చారా?

ఇప్పుడు పై నాలుగు పాయింట్లూ చదివాక ఈ రెండు విషయాలనూ లింక్ చేసుకోండి.

 1. లాంగ్వేజ్ పేపర్లలో బిట్ ప్రశ్నలు ఉన్నాయి. గ్రూప్ పేపర్లలో (గతంలో 30 మార్కులకు ఉండేవి) ఇప్పుడు లేవు. ఇది పేపర్ మోడల్ మార్పు.

2. లాంగ్వేజ్ పరీక్షలు అయ్యాక,  మాల్ ప్రాక్టీస్ పై తీవ్ర చర్యలు మొదలయ్యాయి. టీచర్లను అరెస్టు చేశారు. ముఖాలకు ముసుగులు వేసుకుని వాళ్ళు స్టేషన్ లో నిలబడి ఉన్న ఫోటోలు అన్ని టీచర్ల గ్రూపుల్లోనూ షేర్ అయాయి. పరీక్షా కేంద్రాల్లో వాటర్ బోయ్ లను తీసివేశారు. ఆఖరుకు చీఫ్ దగ్గర కూడా ఫోను ఉండకుండా చేశారు. క్రమంగా మాథ్స్ నుంచి సోషల్ దాకా రోజు రోజుకూ పరీక్షలు strict గా జరక్క తప్పలేదు.

ఏ మాత్రం ఆలోచన ఉన్న వాళ్ళకైనా విషయం స్పష్టంగా అర్ధమైపోవట్లా? ఏం జరిగిందో తెలిసిపోవట్లా?

ఇదీ పరిస్థితి. ఇప్పుడు జరిగింది మంచికో, చెడుకో? ఇది కొనసాగడం మంచిదో కాదో? ఎవరి ఆలోచనా స్థాయిని బట్టి వాళ్ళు, ఎవరి వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిందే. Paper model ను సులభం చేసి, పరీక్షలను strict గా జరిపితే మేలేమో. చర్చ జరగాలి. అది నిర్మాణాత్మకంగా ఉండాలి. పిల్లలకు నిజమైన మంచి చేసేదిగా ఉండాలి.*

(సమాప్తం)

మిత్రులకు విజ్ఞప్తి. ఈ పైవి నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. నా అనుభవమూ, పరిశీలనల మేరకు నాకు ఇలా అర్థమయింది. ప్రతి టీచరూ వీటి పట్ల అవగాహనతో లేకపోతే ప్రతిదానికీ మనల్నే తప్పుపడుతున్న పరిస్థితుల్లో మనం డిఫెన్స్ లో పడిపోతామని నా భయం.

భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. వాటిని నేను గౌరవిస్తాను. థాంక్యూ.

ఇది కరెక్ట్ అనుకుంటే విస్తృతంగా షేర్ చేయండి. అవకాశం వచ్చిన దగ్గరల్లా CCE formative లకు వ్యతిరేకంగా, అప్ లోడ్ లకు వ్యతిరేకంగా మాట్లాడండి. ఏమో, మనందరం ఒకే అవగాహనతో ఒకే మాట మీద ఉంటే ఈ cce బాధలు తప్పించగలమేమో.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad