*నమస్కారం - సంస్కారం*
➖➖➖✍️
భారతదేశ సంస్కృతి అతి ప్రాచీనమైనది. ఎన్నో యుగాలుగా మంచి విషయాలకు ప్రాధాన్యతనిస్తూ, సమయానికి తగినట్లుగా, తన ఒరవడిని మార్చుకుంటూ సాగుతున్నది. రకరకాల సంస్కృతుల నుండి మంచిని గ్రహిస్తూ, పాత కొత్తల మేలు కలయికతో పుటం పెట్టిన Please మేలిమి బంగారం వలె, నిత్యనూతనమై, కాంతులీను చున్నది.
మన సంస్కృతిలో నమస్కారం అనే చర్యకు చాలా విలువ ఉన్నది. సాధారణంగా దేవునికి, గురువులకు, వయసులో కానీ, వరుసలో కానీ పెద్దైన వారికి, అతిథులకు, పదవిలో ఉన్నవారికి చేతులు జోడించి నమస్కరించడం మన సంస్కృతి, సంప్రదాయం. మన పురాణేతిహాసాల ప్రకారం ఎదుటివారిలో దైవత్వానికి, మనం చేతులు జోడించి నమస్కరిస్తున్నాం, అంటే ఆ నమస్కారం మన ఎదురుగా నిలబడిన వ్యక్తికి కాదు. అతనిలో అంతర్గతంగా ఉన్న దైవానికి, ఆత్మారామునికి. ఈవిధంగా మనం ప్రతి ఒక్కరినీ పరమాత్మ స్వరూపంగా భావిస్తున్నామని చెప్పవచ్చు.
అంతేకాదు మనం రెండుచేతులు జోడించినపుడు, రెండు చేతుల వేళ్ళు, అరిచేతులు కలిసి ఒక దానిపై ఒకటి ఒక రకమైన ఒత్తిడిని తెస్తాయి. దాని వలన మన శరీరంలోని అన్ని రక్త నాళాలలో ప్రసరణ వృద్ధి చెంది, మనలో ఒకరకమైన ఉత్తేజం ఏర్పడుతుంది. మన శరీరంలో రక్తప్రసరణ చురుకుగా సాగుతుంది. ఒకవిధంగా ఎదుటివారికి నమస్కరించడం కూడా మన మేలుకే నన్నమాట.
మన ముందు తరం వారు పెద్దవారి కాళ్ళను తాకి నమస్కరించేవారు. అప్పుడు శరీరంలో కదలికలు ఏర్పడి శరీరం మొత్తం ఉత్తేజితమౌతుంది. ఈ రకంగా పరిశీలిస్తే ప్రాచీనులు ప్రవేశపెట్టిన సాంప్రదాయాలు మన మేలుకోసమే అని అర్థమౌతోంది. నమస్కారం మన సంస్కారాన్ని తెలియ పరచడమే కాక, ధైవానికి నమస్కరించడం, మన శరీరానికి మేలు జరగడం అన్నీ జరుగుతాయి. అందుకే యోగాభ్యాసంలో సూర్య నమస్కారాలకు చాలా ప్రాముఖ్యత ఉంది.
మన ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలకు ఆకర్షింప బడిన ఎందరో విదేశీయులు మన భారత దేశానికి ప్రపంచం నలుమూలల నుండి వచ్చి ఇచ్చటి వేద విద్య నభ్యసించి
మన సంస్కృతి పై గౌరవంతో సంప్రదాయాలను పాటించు చున్నారు. ఇది మనకు గర్వకారణం.
ఇంటి చెట్టు మందుకు పనికి రాదు అన్నట్లు మన సంస్కృతి, సంప్రదాయాలకు మన వారు విదేశీ మోజుతో అంధానుకరణ చేస్తూ తిలోదకాలు ఇస్తున్నారు. కానీ మన కన్నా అధికంగా విదేశీయులు వాటిని గౌరవిస్తున్నారు. మనము కూడా ప్రాచీన మైనవేవీ నేటి తరానికి పనికి రావన్న భావన నుండి బైటపడి అందులో ఉన్న మంచిని గ్రహించే ప్రయత్నం చేయాలి.
మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను నిలిపే భారం మన పచనే ఉంది. నేటి ఈ కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం మన సంప్రదాయాన్ని అనుసరిస్తూ
చేతులు కలపడం మాని, సామాజికదూరాన్ని పాటించడానికి చేతులు జోడించే సంప్రదాయాన్ని అలవర్చు కుంటోంది.
అప్పటిలో మన వారు పాటించిన ఎన్నో విషయాలను నేడు వైద్యులు మనను పాటించ మంటున్నారు. నాటి నుండే మనము పెద్దలమాటకు గౌరవమిచ్చి ఆ సంప్రదాయాలను కొనసాగించి ఉంటే ఈ రోజు ఇన్ని లక్షల మంది కరోనా బారిన పడేవారు కాదేమో.
ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి మన సంస్కృతి, సంప్రదాయాలను పాటించడానికి ప్రయత్నిద్దాం. మన భావితరాలకు నేర్పుదాం. చేయి కలిపే ప్రాచ్య సంస్కృతిని వదలి, చేతులు జోడించే మన ప్రాచీన సంస్కృతిని స్వాగతిద్దాం. ✍️
…..శ్రీమతి నందగిరి రామశేషు.
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
Post a Comment
0 Comments